

న్యూజిలాండ్‌పై లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 115 పరుగుల తేడాతో విజయం సాధించిన అనంతరం ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వివాదంలో చిక్కుకున్నాడు. జట్టు నిబంధనలను ఉల్లంఘించి పేసర్ గస్ అట్కిన్సన్‌తో కలిసి జూన్ 8 తెల్లవారుజామున లండన్‌లోని ఓ నైట్‌క్లబ్‌ను సందర్శించినట్లు వార్తలు వెలువడ్డాయి. అర్ధరాత్రి తర్వాత బయట ఉండకూడదనే జట్టు నిబంధనలను ఉల్లంఘించినట్లు భావిస్తూ ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అధికారిక విచారణ ప్రారంభించింది.
ఈ ఘటనలో ఓ రగ్బీ అకాడమీ ఆటగాడితో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఆ సమయంలో జరిగిన తోపులాటలో బోర్డు భద్రతా సిబ్బందిలో ఒకరికి గాయమై కుట్లు వేయాల్సి వచ్చినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే స్టోక్స్ లేదా అట్కిన్సన్ ఎలాంటి దాడికి పాల్పడలేదని ఇంగ్లండ్ క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ క్రమశిక్షణా ఉల్లంఘన అంశాన్ని బోర్డు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.
బెన్ స్టోక్స్ గతంలో కూడా ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలిచాడు. 2017లో బ్రిస్టల్‌లో జరిగిన ఘర్షణ ఘటనలో అతని పేరు వినిపించింది. విదేశీ పర్యటనల సమయంలో క్రమశిక్షణా లోపాల ఆరోపణలు రావడంతో జట్టులో కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా ఘటనపై బోర్డు తీసుకునే నిర్ణయం స్టోక్స్ భవిష్యత్తు, కెప్టెన్సీపై ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!