

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి మైదానం లోకి దిగడానికి సిద్ధమవుతున్నాడు. నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో ఓపెనర్ గా తన స్వంత శైలిలో మెరిసేందుకు రోహిత్ సిద్ధంగా ఉన్నాడు. రాంచీలో ఇప్పటికే తీవ్రంగా ప్రాక్టీస్ చేసిన ఈ దిగ్గజం, ఆస్ట్రేలియాతో గత వన్డే సిరీస్ లా ఈ సిరీస్ లో కూడా మెరుపులు చిమ్మించే అవకాశం ఉంది. కేవలం మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్ రోహిత్‌కు ప్రత్యేకంగా నిలవబోతుంది. ఎందుకంటే ఇక్కడే అతను 5 ముఖ్య ప్రపంచ రికార్డులు, 11 అద్భుత ఘనతలు సాధించే అవకాశం ఉంది!
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సౌతాఫ్రికా వన్డే సిరీస్‌లో 5 ముఖ్య ప్రపంచ రికార్డులను అధిగమించే అవకాశం కలిగి ఉన్నాడు. ఈ సిరీస్ లో మరో 98 పరుగులు చేస్తే, అంతర్జాతీయ క్రికెట్లో 20,000 పరుగుల మైలురాయి చేరుకుని, ఈ ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు (351) కొట్టిన పాకిస్తాన్ దిగ్గజం షాహిద్ అఫ్రిది రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం 7 సిక్సర్లు మాత్రమే దూరం. ఓపెనర్‌గా 15,787 పరుగులు చేసిన రోహిత్, మరో 213 పరుగులు చేస్తే 16,000 పరుగుల మార్క్‌ను దాటనున్నాడు. ముఖ్యంగా, ఓపెనర్‌గా క్రిస్ గేల్ (338 సిక్సర్లు) రికార్డును అధిగమించడానికి 8 సిక్సర్లు, ఓపెనర్‌గా అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఏకైక భారతీయుడిగా నిలవడానికి ఒక సెంచరీ మాత్రమే అవసరం.
ఈ సిరీస్‌లో రోహిత్ స్వదేశంలో సౌతాఫ్రికా పై అరుదైన ఘనతలు సాధించగలడు. సౌతాఫ్రికా పై మరో 27 పరుగులు చేస్తే, ఆ జట్టుపై 2,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేస్తాడు. అలాగే, ఆ జట్టు పై అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు కు మరో 7 సిక్సర్లు దూరంలో ఉన్నాడు. భారత గడ్డ పై వన్డేల్లో 5,000 పరుగులు పూర్తి చేయడానికి 133 పరుగులు అవసరం. ఈ ఘనత సాధించిన మూడో భారతీయ ఆటగాడిగా మారతాడు.
హిట్‌మ్యాన్ జట్టు విజయాల్లో కూడా తన ముద్ర వేయబోతున్నాడు. భారత్ గెలిచిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో 12,000 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 30 పరుగులు దూరం. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా ఓపెనర్ గా నిలుస్తాడు. అంతేకాకుండా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA) దేశాల పై వన్డేల్లో 5,000 పరుగులు పూర్తి చేయడానికి 36 పరుగులు మాత్రమే అవసరం. ఈ రికార్డులు, ఘనతలు ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను రోహిత్ శర్మకు చారిత్రక మైలురాయిగా మార్చనున్నాయి!










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!