

పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ రింకు హుడా స్వర్ణ పతకం సాధించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. వ్యక్తిగత జీవితంలో తీవ్ర విషాదాన్ని ఎదుర్కొన్నప్పటికీ, పట్టుదలతో పోటీల్లో పాల్గొని దేశానికి పతకాన్ని అందించాడు. ఆగస్టులో తల్లి మరణించడంతో తీవ్ర మనోవేదనకు గురైన రింకు.. ఆమె మృతిచెందిన రెండు వారాలకే తిరిగి శిక్షణ ప్రారంభించాడు. అయితే భుజానికి గాయం కావడంతో 20 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. కోలుకున్న తర్వాత మళ్లీ సాధన కొనసాగించి స్వర్ణం సాధించాడు. “మా అమ్మ మరణంతో ఎంతో వేదనకు గురయ్యా. ఇప్పటికీ ఆ బాధ అలాగే ఉంది. మా అమ్మ కోసం స్వర్ణం గెలవాలనుకున్నా. ఈ పతకాన్ని ఆమెకు అంకితం చేస్తున్నా” అని రింకు భావోద్వేగంగా తెలిపాడు.
హరియాణాకు చెందిన రింకు హుడా జీవితం ఎన్నో సవాళ్లతో సాగింది. మూడేళ్ల వయసులో జరిగిన ప్రమాదంలో ఎడమ చేతిని కోల్పోయినా, క్రీడలపై ఆసక్తిని మాత్రం వదులుకోలేదు. వ్యవసాయ పనుల్లో తండ్రికి సహాయం చేస్తూనే పాఠశాల స్థాయిలో రాష్ట్ర రన్నింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. అతడి ప్రతిభను గుర్తించిన కోచ్ అమిత్ కుమార్ జావెలిన్ త్రో వైపు ప్రోత్సహించాడు. 2015 యూత్ ఆసియా క్రీడల్లో స్వర్ణంతో తన విజయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రింకు, ప్రపంచ అండర్-20 పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం సాధించాడు. 2018 పారా ఆసియా క్రీడల్లో కాంస్యం, 2022లో రజతం గెలుచుకున్నాడు. 2024 పారాలింపిక్స్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. తాజాగా స్వర్ణం సాధించి తన పట్టుదలను మరోసారి నిరూపించాడు. వ్యక్తిగత విషాదాన్ని అధిగమించి సాధించిన ఈ విజయం ఎందరికో స్ఫూర్తినిస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!