

డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం సత్తా చాటుతోంది. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన రికో గుంజిపై 21-12, 21-16తో వరుస గేముల్లో విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. కేవలం 44 నిమిషాల్లోనే ప్రత్యర్థిని ఓడించి తన జోరును కొనసాగించింది. మరోవైపు భారత షట్లర్ అస్మిత చాలిహా కూడా మహిళల సింగిల్స్‌లో సంచలన విజయం నమోదు చేసింది. మూడో సీడ్, జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచిని 21-19, 21-18తో ఓడించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. అయితే మరో భారత క్రీడాకారిణి తన్వి శర్మకు నిరాశ ఎదురైంది. ప్రపంచ నంబర్‌వన్ దక్షిణ కొరియా షట్లర్ ఆన్ సియాంగ్ చేతిలో 11-21, 14-21తో ఓటమి పాలైంది.
పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో భారత ఆటగాడు ఆయుష్‌కు గాయం రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. జపాన్ షట్లర్ కొడై నరాఒకాతో జరిగిన మ్యాచ్‌లో 17-21, 6-21తో వెనుకంజలో ఉన్న సమయంలో ఆయుష్ గాయపడ్డాడు. దీంతో మ్యాచ్‌ను కొనసాగించలేక మధ్యలోనే వైదొలిగాడు. ఫలితంగా నరాఒకా తదుపరి రౌండ్‌కు చేరుకున్నాడు. సింధు క్వార్టర్‌ఫైనల్‌కు చేరడం, అస్మిత చాలిహా మూడో సీడ్‌పై విజయం సాధించడం భారత శిబిరానికి ఊరటనిచ్చాయి. మరోవైపు తన్వి శర్మ, ఆయుష్ టోర్నీ నుంచి నిష్క్రమించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!