

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఈ ఏడాది బతుకమ్మ వేడుకలకు దూరమవుతున్నందుకు భావోద్వేగానికి గురైంది. టోర్నీ షెడ్యూల్ కారణంగా ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆమె, డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో పాల్గొనేందుకు కోపెన్‌హాగన్‌కు వెళ్లింది. ఈ నేపథ్యంలో గతేడాది తన భర్తతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. బతుకమ్మ పండుగలోని రంగులు, పూల సందడిని మిస్ అవుతున్నట్లు పేర్కొంది.
అయితే, వెండి బతుకమ్మను పట్టుకుని ఉన్న సింధు ఫొటోపై ఓ నెటిజన్ విమర్శలు చేయగా, ఆమె తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ఇతరుల గురించి అభిప్రాయానికి వచ్చే ముందు సంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలని సూచించింది. తన పుట్టింటి వైపు బతుకమ్మ జరుపుకునే సంప్రదాయం లేదని, అందుకే గతేడాది వేడుక తన జీవితంలోనే మొదటిదని వివరించింది. తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన కుటుంబంలో వివాహం తర్వాత ఈ పండుగలో పాల్గొన్నానని, పెద్ద పూల బతుకమ్మను రోజంతా కష్టపడి స్వయంగా పేర్చానని తెలిపింది. వెండి బతుకమ్మ మాత్రం తనను ఈ సంప్రదాయంలోకి ఆప్యాయంగా ఆహ్వానించేందుకు అత్తయ్య ఇచ్చిన ప్రేమకు గుర్తు అని చెప్పింది. సింధు సమాధానం కుటుంబ అనుబంధం, సంప్రదాయాల పట్ల గౌరవం ప్రాధాన్యాన్ని చాటింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!