

కశ్మీర్‌కు చెందిన క్రికెటర్ జహంగీర్ లోన్ ఓ వ్యక్తిపై దాడి చేసినట్లు చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానికంగా జరిగిన రెడ్ ప్రీమియర్ లీగ్ (RPL) మ్యాచ్ అనంతరం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. గత ఆదివారం అథ్వాస్ ఇండియా XI, రాయల్ గుడ్‌విల్ సీసీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అథ్వాస్ ఇండియా XI మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అనంతరం అథ్వాస్ జట్టు అభిమానులు మైదానంలోకి రావడంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో రాయల్ గుడ్‌విల్ సీసీ ఆటగాడైన జహంగీర్ లోన్ ఓ వ్యక్తిపై దాడి చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. సహచరులు, ఇతరులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ అతడు కొడుతూనే ఉండటం విమర్శలకు దారితీసింది.
ఈ ఘటనపై స్పందించిన జహంగీర్ లోన్.. తన కుటుంబాన్ని అవమానించేలా ఆ వ్యక్తి దూషించడంతోనే తాను అలా ప్రవర్తించినట్లు వివరణ ఇచ్చాడు. “ఎవరైనా నా కుటుంబాన్ని దూషిస్తే నేను సహించను. నా కుటుంబమే నా గౌరవం. అతడు నా కుటుంబాన్ని అవమానించేలా మాట్లాడాడు. అందుకే అలా స్పందించాను” అని తెలిపినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. అయితే, ఘటనకు దారితీసిన పూర్తి పరిస్థితులు స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు. ఈ ఉదంతం నేపథ్యంలో క్రీడాకారులు మైదానంలోనూ, మైదానం వెలుపలా సంయమనం పాటించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!