

క్రీడాస్ఫూర్తికి పేరుగాంచిన న్యూజిలాండ్‌తో భారత క్రికెట్ జట్టుకు దశాబ్దాల చరిత్ర ఉంది. 1968లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ నాయకత్వంలో న్యూజిలాండ్ గడ్డపై భారత్ 3–1తో టెస్టు సిరీస్ గెలిచి, విదేశాల్లో తొలి టెస్టు సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. 1975 వన్డే ప్రపంచకప్‌లో భారత్–న్యూజిలాండ్ జట్లు తలపడగా, కివీస్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 1987 ప్రపంచకప్‌లో నాగ్‌పుర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చేతన్ శర్మ హ్యాట్రిక్ సాధించి, వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. 1994లో ఆక్లాండ్‌లో జరిగిన వన్డేలో తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగిన సచిన్ టెండూల్కర్ 49 బంతుల్లో 82 పరుగులు చేసి తనదైన ముద్ర వేశాడు. అనంతరం 2009లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో భారత్ న్యూజిలాండ్‌లో తొలి వన్డే సిరీస్‌ను 3–1తో కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగిసింది.
ఈ రెండు జట్ల పోరులో ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో పాటు చేదు అనుభవాలూ ఉన్నాయి. 2009లో క్రైస్ట్‌చర్చ్‌లో సచిన్ టెండూల్కర్ 163 పరుగులతో అజేయంగా నిలవడంతో భారత్ 392/4 భారీ స్కోరు సాధించింది. 2014లో వెల్లింగ్టన్ టెస్టులో బ్రెండన్ మెకల్లమ్ 302 పరుగులు చేసి టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2019లో హామిల్టన్ వన్డేలో భారత్ కేవలం 92 పరుగులకే ఆలౌటవగా, ట్రెంట్ బౌల్ట్ 21 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడు. అదే ఏడాది ప్రపంచకప్ సెమీఫైనల్‌లో వర్షం కారణంగా రెండు రోజులు సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ మ్యాచ్ ఎంఎస్ ధోనీకి చివరి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలిచింది. ఇక 2020లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌లు సూపర్ ఓవర్‌కు దారితీయగా, రెండింటిలోనూ భారత్ విజయం సాధించింది. అదే ఏడాది ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 5–0తో క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. ఈ ఘట్టాలన్నీ భారత్–న్యూజిలాండ్ క్రికెట్ పోటీకి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!