

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రతిభను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే గుర్తించినట్లు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వెల్లడించాడు. 2008లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లీ ఆటతీరును చూసి ఆశ్చర్యపోయానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు. అప్పట్లో శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అజంత మెండిస్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, అలాంటి బౌలర్‌ను ఎదుర్కొని కోహ్లీ అర్ధశతకం సాధించడం అతడి ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నాడు. కోహ్లీ భవిష్యత్తులో రాహుల్ ద్రవిడ్ రికార్డులను అధిగమించగలడని అప్పుడే అంచనా వేసినట్లు తెలిపాడు. విజయంపై అతడికి ఉన్న తపన, పరుగులు సాధించాలనే ఆకాంక్ష ప్రత్యేకమైనవని, అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన తర్వాతి రెండేళ్లలోనే తన ఆటతీరును గణనీయంగా మెరుగుపరుచుకున్నాడని హర్భజన్ ప్రశంసించాడు.
భారత జట్టులో ఫిట్‌నెస్ ప్రమాణాలను మెరుగుపరచడంలోనూ కోహ్లీ కీలక పాత్ర పోషించాడని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. గతంలో కంటే భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్, ఫీల్డింగ్ ప్రమాణాలు గణనీయంగా మెరుగయ్యాయని, ఈ మార్పులో కోహ్లీ కృషి ఎంతో ఉందని పేర్కొన్నాడు. ఇప్పటికీ ఆటపై అతడికి ఉన్న ఆసక్తి, ప్రతి మ్యాచ్‌లోనూ భారత్ గెలవాలనే పట్టుదల ఏమాత్రం తగ్గలేదని కొనియాడాడు. వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ తర్వాత కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం భారత జట్టు తరఫున వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్న కోహ్లీ, తన స్థిరమైన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!