

నాలుగేళ్ల విరామం తర్వాత భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన పేసర్ భువనేశ్వర్ కుమార్ తన రీఎంట్రీ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇటీవల జరిగిన ఓ చిట్‌చాట్‌లో తన అనుభవాలను వెల్లడించగా, ఆ వీడియోను బీసీసీఐ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. తన పునరాగమనం వెనుక కుటుంబ సభ్యుల మద్దతు ఎంతో ఉందని భువీ తెలిపాడు. అయితే, రీఎంట్రీ గురించి తాము ఒక్కరోజు కూడా ప్రత్యేకంగా చర్చించుకోలేదని చెప్పాడు. తిరిగి భారత జట్టులోకి వచ్చిన తర్వాత తన ప్రదర్శనపై పెద్దగా అంచనాలు పెట్టుకోవడం లేదని, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వర్తమానంపైనే దృష్టి పెడతానని వివరించాడు. గత నాలుగేళ్లుగా భారత్‌కు ఆడే అవకాశం లేకపోయినా, తనవంతుగా కష్టపడటం మాత్రం ఆపలేదని పేర్కొన్నాడు. ఈ కాలం తన వ్యక్తిగత ఎదుగుదలకు కూడా దోహదపడిందని తెలిపాడు.
తన కొత్త జెర్సీ నంబర్ 78 వెనుక ఉన్న కారణాన్ని కూడా భువనేశ్వర్ వెల్లడించాడు. 78లోని అంకెలను కలిపితే 15 వస్తుందని, ఆ రెండు అంకెలను కలిపితే ఆరు వస్తుందని వివరించాడు. గతంలో తాను ధరించిన జెర్సీ నంబర్ 15 కూడా ఇదే విధంగా ఆరు అంకెకు చేరుతుందని, అందుకే తనకు ప్రత్యేకమైన ఆ సంఖ్య వచ్చేలా కొత్త నంబర్‌ను ఎంచుకున్నట్లు తెలిపాడు. తన బౌలింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నానని, బ్యాటర్ ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుని బంతులు వేయడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. భారత జట్టులోకి తిరిగి రావడానికి దేశవాళీ క్రికెట్‌లోని ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, యూపీ టీ20 లీగ్, ఐపీఎల్ వంటి టోర్నీల్లో ఆడానని వెల్లడించాడు. తొలి మ్యాచ్‌లో విజయం యువ జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డాడు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!