

టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించాడు. గాయం నుంచి కోలుకుని ఫిట్నెస్ సాధించినప్పటికీ, తిరిగి భారత జట్టులో అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పటి కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆరోపించాడు. ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిశ్రా ఈ విషయాలను పంచుకున్నాడు. బెంగళూరులో కాలికి గాయమైనప్పుడు కుంబ్లే తనను ఆందోళన చెందవద్దని, ఫిట్నెస్ సాధించిన వెంటనే జట్టులోకి తిరిగి రావచ్చని చెప్పినట్లు గుర్తుచేసుకున్నాడు. అప్పట్లో కెప్టెన్‌గా ఉన్న కోహ్లీని కూడా జట్టులోకి తిరిగి రావడానికి ఏం చేయాలని అడిగానని తెలిపాడు.
గాయం నుంచి కోలుకున్న తర్వాత జాతీయ జట్టులో పునరాగమనంపై కోహ్లీకి సందేశం పంపినా స్పందన రాలేదని మిశ్రా పేర్కొన్నాడు. నేరుగా అడిగినప్పుడు వారం లేదా పది రోజుల్లో సమాచారం ఇస్తానని చెప్పినప్పటికీ, ఎలాంటి అప్డేట్ అందలేదని తెలిపాడు. పలుమార్లు ఫోన్ చేసినా, సందేశాలు పంపినా సమాధానం రాకపోవడంతో చివరకు ప్రయత్నాలు విరమించుకున్నానని చెప్పాడు. తనకంటే తీవ్రమైన గాయాల నుంచి కోలుకున్న కొందరు క్రికెటర్లు తిరిగి జట్టులో స్థానం సంపాదించుకున్నారని, తన విషయంలో మాత్రం అలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమితుడైన అమిత్ మిశ్రా చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీశాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!