

టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో తన రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు. క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో ఒకే క్యాలెండర్ ఏడాదిలో అంతర్జాతీయ టీ20ల్లో 1,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత ఓపెనర్‌గా నిలిచాడు. మొత్తంగా ఈ ఘనత సాధించిన మూడో భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. సూర్యకుమార్ యాదవ్ 2022లో 1,164 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 2026లో 1,159 పరుగులు సాధించాడు. ప్రపంచ పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఏడాదిలో వెయ్యి పరుగులు చేసిన ఎనిమిదో బ్యాటర్‌గా కూడా అభిషేక్ నిలిచాడు.
ఇదే మ్యాచ్‌లో అభిషేక్ మరో ప్రపంచ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో పవర్‌ప్లే సమయంలో 100 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 98 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా, మార్టిన్ గప్టిల్ 97, పాల్ స్టిర్లింగ్ 94, క్వింటన్ డి కాక్ 87 సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అభిషేక్ 21 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 27 పరుగులు చేసి ఔటయ్యాడు. స్వల్ప ఇన్నింగ్స్ ఆడినప్పటికీ రెండు కీలక మైలురాళ్లను అందుకున్నాడు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!