

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు’ 10వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. ‘దశావతారం.. ఆటలో సవాల్ కాదు, ఆటే సవాల్’ అనే కాన్సెప్ట్‌తో ఈ సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు కామనర్స్‌కు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ‘అగ్నిపరీక్ష సీజన్ 2’ ద్వారా ఎంపికైన కొంతమంది సామాన్యులు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.
ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్ల విషయంలోనూ క్రేజ్ ఉన్న పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీరియల్ నటి దేబ్జానీ మోదక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ‘ఎన్నెన్నో జన్మల బంధం’, ‘సత్యభామ’ వంటి సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ బెంగాలీ నటి బిగ్‌బాస్ 10లో పాల్గొనడం దాదాపు ఖరారైందంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆమెకు వారానికి రూ.4 లక్షల పారితోషికం అందనున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!