

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లకు గట్టిగానే క్లాస్ తీసుకున్నారు. శనివారం ఎపిసోడ్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చిన ఆయన, ముందుగా హౌస్‌లో జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. ముకేశ్ తనను పట్టించుకోవడం లేదంటూ ఝాన్సీ ఏడవడం, వాష్‌రూమ్ దగ్గర బట్టల విషయంలో త్రిగుణ్–రోహిత్ మధ్య జరిగిన వాగ్వాదం వంటి అంశాలను చర్చించారు. రోహిత్, త్రిగుణ్‌ను కొడతానంటూ హెచ్చరించడంతో వివాదం మరింత ముదిరింది. కొత్త కెప్టెన్‌గా ఎంపికైన రామ్ ప్రసాద్‌కు నాగార్జున అభినందనలు తెలిపారు. హౌస్‌లో పరిశుభ్రత, క్రమశిక్షణ పాటించేలా చూడాలని సూచించారు.
నీతూ నటరాజ్‌ను కన్ఫెషన్ రూమ్‌కు పిలిచిన నాగార్జున, రోహిత్‌తో ఆమె మాట్లాడిన విషయాలను ప్రస్తావించారు. రోహిత్ తల్లి హౌస్‌లోకి వచ్చిన సందర్భంలో బయట విషయాలను నీతూ అతనితో పంచుకున్న అంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హౌస్‌కు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించవద్దని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి తప్పు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. కన్ఫెషన్ రూమ్‌లో జరిగిన సంభాషణను ఇతర కంటెస్టెంట్లకు వెల్లడించవద్దని కూడా సూచించారు.
అనంతరం షాలిని, అమన్, రోహిత్ నామినేషన్ల గురించి చర్చించుకున్న వీడియోను నాగార్జున హౌస్‌లోని సభ్యులందరికీ చూపించారు. గతంలోనూ ఈ అంశంపై హెచ్చరించినప్పటికీ, మళ్లీ అదే తప్పు చేయడంపై షాలినిని ప్రశ్నించారు. నామినేషన్ల గురించి ముందుగానే చర్చించినందుకు అమన్, షాలిని, రోహిత్ వచ్చే వారం కెప్టెన్సీ పోటీలో పాల్గొనడానికి, కెప్టెన్‌గా మారడానికి అర్హులు కారని పనిష్మెంట్ విధించారు. అలాగే త్రిగుణ్‌ను దూషించిన వీడియోను చూపించి, అతనికి క్షమాపణ చెప్పాలని షాలినిని ఆదేశించారు. షాలినికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలనే ప్రశ్నకు రోహిత్ డబుల్ డ్యూటీ సూచించగా, ఏ పని అప్పగించాలనేది రామ్ ప్రసాద్ నిర్ణయిస్తారని నాగార్జున చెప్పారు.
నామినేషన్ల సమయంలో నీతూతో షాలిని గొడవపడిన తీరుపైనా నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేశారు. నీతూ తనను కొట్టిందంటూ షాలిని చేసిన ఆరోపణలు, ఆమెను మానసికంగా ఇబ్బంది పెట్టేలా మాట్లాడిన సందర్భాలను ప్రస్తావించారు. అమన్ ముకేశ్‌ను దూషించిన వీడియోను చూపిస్తూ అతడిని కూడా ప్రశ్నించారు. మరోవైపు, త్రిగుణ్‌తో తనకు ఉన్న విభేదాలపై రోహిత్ మాట్లాడగా, ఇతరుల గురించి కాకుండా తన ఆట గురించి చెప్పాలని నాగార్జున సూచించారు. అమన్‌ను ఉద్దేశించి రోహిత్ చేసిన వ్యాఖ్యలపైనా చర్చ జరిగింది. పలువురు కంటెస్టెంట్లు రోహిత్ తీరును తప్పుబట్టారు.
చివరగా త్రిగుణ్ తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని నాగార్జున సూచించారు. రోహిత్ ఆటతీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. హౌస్‌లో ఆహారం, పరస్పర గౌరవం, కంటెస్టెంట్ల మధ్య గొడవల గురించి కూడా చర్చించారు. అనంతరం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఆటతీరుపై స్పందిస్తూ, వారిలో ఆశించిన స్థాయిలో ఫైర్ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. వారి గురించి తదుపరి ఎపిసోడ్లో మాట్లాడతానని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం జరగనున్న ఎలిమినేషన్‌పై ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!