

సెప్టెంబర్ 6న ప్రారంభమైన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో మొత్తం 16 మంది కంటెస్టెంట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. వీరిలో 10 మంది సెలబ్రిటీలు కాగా, ఆరుగురు కామనర్స్ ఉన్నారు. సెలబ్రిటీ కంటెస్టెంట్లలో హీరో త్రిగుణ్ ఇప్పటికే తన దూకుడు గేమ్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. టాస్కుల్లో చురుగ్గా పాల్గొంటూ, తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. అయితే రోహిత్‌ను మాత్రమే టార్గెట్ చేస్తున్నాడనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఎక్కువ మంది ప్రేక్షకులు త్రిగుణ్ గేమ్‌కు మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తోంది.
త్రిగుణ్ అసలు పేరు ఆదిత్ అరుణ్. 2009లో కథ అనే తెలుగు సినిమాతో హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన.. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. తుంగభద్ర, గరుడ వేగా, 24 కిసెస్, చీకటి గదిలో చితక్కొట్టుడు, డియర్ మేఘ, లైన్ మ్యాన్, ఈషా వంటి సినిమాల్లో కనిపించారు. వెబ్ సిరీస్‌ల్లోనూ నటించిన త్రిగుణ్.. కొన్ని చిత్రాల్లో సెకండ్ హీరోగా కూడా మెప్పించారు. ఇప్పుడు బిగ్‌బాస్ ద్వారా తన క్రేజ్‌ను మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 టైటిల్ విన్నర్, సింగర్ రేవంత్‌కు త్రిగుణ్ బంధువు అనే విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఆట తీరు, మాట తీరు విషయంలోనూ త్రిగుణ్ రేవంత్‌ను గుర్తు చేస్తున్నాడని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య బంధుత్వం ఉందనే ప్రచారం రావడంతో ఈ విషయం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి రేవంత్ బాటలోనే త్రిగుణ్ కూడా బిగ్‌బాస్ టైటిల్‌ను గెలుచుకుంటాడా అనేది తెలియాలంటే సీజన్ మరింత ముందుకు సాగాల్సిందే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!