

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో గురువారం ప్రసారమైన ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో సాగింది. ఎల్లో జోన్‌లో ఉన్న కంటెస్టెంట్లకు గ్రీన్ జోన్‌లోకి వెళ్లే అవకాశం కల్పించేందుకు బిగ్ బాస్ ‘గోట్ ఆఫ్ ఎండ్యూరెన్స్’ టాస్క్‌ను నిర్వహించాడు. ఈ టాస్క్‌లో చివరి వరకు బరువులను మోస్తూ నిలబడిన కంటెస్టెంట్‌కు గోట్‌గా నిలిచే అవకాశం, రెండు వారాల ఇమ్యూనిటీ లభిస్తాయని ప్రకటించాడు. ఈ ఆటకు శ్వేతను సంచాలకురాలిగా నియమించారు. రెడ్ టీమ్ సభ్యులు బిగ్ బాస్ సూచించిన బరువులను ఎల్లో టీమ్ కంటెస్టెంట్లకు కేటాయించాల్సి వచ్చింది.
టాస్క్ ప్రారంభమైన తర్వాత శివ్, త్రిగుణ్, దేబ్జానీ, వర్షిణిలపై ఎక్కువగా బరువులు వేసి వారిని లక్ష్యంగా చేసుకున్నారు. వర్షిణి తొలుత బరువు తట్టుకోలేక కిందపడిపోగా, సుమారు 32 కిలోల బరువును మోసిన శివ్ కూడా చివరకు ఆట నుంచి తప్పుకున్నాడు. నీతూ, త్రిగుణ్‌లు సైతం ఎక్కువసేపు బరువులను మోసిన తర్వాత టాస్క్‌ను వదిలేశారు. అనంతరం ముకేష్‌ను లక్ష్యంగా చేసుకోవడంతో ఆయన కూడా ఆట నుంచి తప్పుకున్నాడు. చివరికి అమన్, నరేష్ మాత్రమే మిగిలారు. అయితే, చాలామంది అమన్‌పై ఎక్కువ బరువులు వేయగా, నరేష్‌కు తక్కువ బరువులు కేటాయించారు. దీంతో నరేష్ చివరి వరకు నిలబడగలిగాడు.
మరోవైపు, ముకేష్, శివ్ మధ్య వ్యక్తిగత వ్యాఖ్యలతో వాగ్వాదం చోటుచేసుకుంది. శివ్‌ను ఉద్దేశించి ముకేష్ చేసిన వ్యాఖ్యలతో శివ్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. టాస్క్‌లో అందరూ సేఫ్ గేమ్ ఆడారని, తనను కావాలనే లక్ష్యంగా చేసుకున్నారని అమన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. నరేష్‌కు తక్కువ బరువులు కేటాయించడంతో టాస్క్‌లో గెలిచినప్పటికీ, అసలు విజేత ఎవరు అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. చివరకు బిగ్ బాస్ కీలక ట్విస్ట్ ఇచ్చాడు.
ఎక్కువ బరువును మోసిన అమన్‌ను గోట్‌గా ప్రకటించడంతో పాటు, మహిళా కంటెస్టెంట్లలో అత్యధిక బరువును మోసిన నీతూ, ఎక్కువసేపు బరువులతో నిలబడిన దేబ్జానీలను కూడా గోట్స్‌గా ఎంపిక చేశాడు. ఈ ముగ్గురికీ వచ్చే వారం నామినేషన్ల నుంచి ఇమ్యూనిటీ లభిస్తుందని ప్రకటించాడు. దీంతో అమన్, నీతూ, దేబ్జానీలు ఆనందం వ్యక్తం చేయగా, నరేష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఈ టాస్క్ ఆడటం తనకు కష్టమని తెలిసినప్పుడు ముందే చెప్పి ఉంటే తాను తప్పుకునేవాడినని, తన బాధను రాం ప్రసాద్‌తో పంచుకున్నాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!