

విడుదల తేదీ: జనవరి 30, 2026
నటీనటులు: విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ జాధవ్, మహేష్ మంజ్రేకర్
దర్శకుడు: కిషోర్ పాండురంగ్ బెలేకర్
నిర్మాతలు: రాజేష్ కేజ్రీవాల్, గుర్పాల్ సాచర్
సంగీత దర్శకుడు: ఏ.ఆర్. రెహమాన్
సినిమాటోగ్రాఫర్: కరణ్ బి. రావత్
ఎడిటర్: ఆశిష్ మాథ్రే
ముంబయి స్లమ్‌లో తన అనారోగ్యంతో ఉన్న తల్లితో జీవించే నిరుద్యోగ గ్రాడ్యుయేట్ మహాదేవ్ (విజయ్ సేతుపతి) కథే ఈ సినిమా ప్రధానాంశం. చదువు ఉన్నప్పటికీ లంచం ఇవ్వలేక ప్రభుత్వ ఉద్యోగం దక్కదు. తన పొరుగింటి అమ్మాయి (అదితి రావు హైదరీ)పై ప్రేమ కలిగి ఉంటాడు.
మరోవైపు ఒకప్పుడు పేరున్న బిల్డర్ అయిన బోస్మన్ (అరవింద్ స్వామి) చట్టపరమైన సమస్యలతో తన సామ్రాజ్యాన్ని కోల్పోతాడు. ఈ ఇద్దరి జీవితాలు ఎలా ఒకదానిని ఒకటి ప్రభావితం చేశాయన్నదే కథ. ముఖ్యంగా ఈ సినిమా మొత్తం ఒక్క డైలాగ్ కూడా లేకుండా సాగడం విశేషం.
డైలాగ్స్ లేకుండా పూర్తి స్థాయి సినిమా రూపొందించడం గొప్ప సాహసమే. దర్శకుడు కిషోర్ బెలేకర్ చేసిన ఈ ప్రయోగం ప్రశంసనీయం. స్టార్ నటీనటుల ఎంపిక సినిమాకు కమర్షియల్ టచ్ ఇచ్చింది.
సైలెంట్ ఫిల్మ్ అయినప్పటికీ కథనం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఆర్ట్ ఫిల్మ్ కంటే వినోదాత్మకంగా సాగడం మరో ప్లస్. విజయ్ సేతుపతి తన సహజమైన నటనతో మహాదేవ్ పాత్రకు ప్రాణం పోశారు. అతడి అమాయకత్వం, జీవన పోరాటం ప్రేక్షకుల అనుభూతిని పెంచుతుంది.
అరవింద్ స్వామి నిశ్శబ్దమైన, లోతైన నటనతో మెప్పించారు. సిద్ధార్థ్ జాధవ్ కామెడీ మంచి రిలీఫ్ ఇస్తుంది. అదితి రావు హైదరీ తన పాత్రకు చక్కని మద్దతు అందించారు. సెకండ్ హాఫ్ మరింత ఆసక్తికరంగా సాగుతుంది.
కథ పరంగా ఇది కొత్తదనం లేని, అవినీతి–పేదరికం వంటి పరిచయమైన అంశాలనే చూపిస్తుంది. కొన్ని సన్నివేశాలు ‘వేదం’ సినిమాను గుర్తు చేస్తాయి.
డైలాగ్స్ లేకపోవడంతో వాట్సాప్ చాట్స్, టెక్స్ట్ మెసేజ్‌లపై ఆధారపడాల్సి వస్తుంది. ఇవి వేగంగా మారిపోవడంతో కొన్ని ముఖ్యమైన విషయాలు మిస్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్‌లో నెమ్మదితనం కనిపిస్తుంది.
సాధారణ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఆశించే ప్రేక్షకులకు సినిమా అంతగా నచ్చకపోవచ్చు. క్లైమాక్స్ తర్వాత వచ్చే భాగం ఇంకా బలంగా ఉండాల్సింది. మహేష్ మంజ్రేకర్ పాత్రకు సరైన ముగింపు లేదు.
సైలెంట్ ఫిల్మ్‌కు సంగీతమే ప్రాణం. ఆ బాధ్యతను ఏ.ఆర్. రెహమాన్ అద్భుతంగా నిర్వర్తించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భావోద్వేగాలను బలంగా ఎలివేట్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ సరిపడిన స్థాయిలో ఉన్నప్పటికీ పేసింగ్ మెరుగుపర్చాల్సింది.
నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు కథ పరంగా పెద్ద ప్రయోగం చేయకపోయినా, కథ చెప్పిన విధానం ప్రశంసనీయం.
గాంధీ టాక్స్ ఒక నిశ్ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకున్న ప్రయోగాత్మక సైలెంట్ ఫిల్మ్. కథ సాధారణమైనదైనా, డైలాగ్స్ లేకుండా వినోదాత్మకంగా చెప్పిన ప్రయత్నం సినిమాకు ప్రత్యేకతను తెచ్చింది. విజయ్ సేతుపతి అద్భుతంగా నటించగా, మిగిలిన నటీనటులు మంచి సహకారం అందించారు. ఫస్ట్ హాఫ్ నెమ్మదితనం మైనస్ అయినప్పటికీ, అర్బన్ ఆడియన్స్‌కు ఈ సినిమా ఒక భిన్నమైన అనుభూతిని అందిస్తుంది.
రేటింగ్: 2.75 / 5







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!