

త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీవీకే–కాంగ్రెస్ కూటమిపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో టీవీకే అధ్యక్షుడు విజయ్ తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం విజయ్ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పగా, దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. విజయ్ బూస్ట్ తమకు అవసరం లేదని స్పష్టం చేసిన తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కె. సెల్వపెరుంతగై, తమ కార్యకర్తలకు ఉత్సాహం లోపించలేదని, రాహుల్ గాంధీనే తమకు ప్రేరణ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై టీవీకే లేదా విజయ్ నుంచి అధికారిక స్పందన రాలేదు.
ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు క్లిష్టంగా మారుతున్నాయి. లోక్సభ ఎన్నికల సమయంలో ఏర్పడిన డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి కొనసాగుతుందని ప్రకటిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ నేతలు ఎక్కువ సీట్లు, అధికార భాగస్వామ్యం కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే కాంగ్రెస్–టీవీకే పొత్తు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అన్నా డీఎంకే, బీజేపీ వంటి పార్టీలు టీవీకేను బహిరంగంగా ఆహ్వానించినా, విజయ్ మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో టీవీకే జాతీయ ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్, కాంగ్రెస్తో పొత్తుకు సంకేతాలు ఇస్తూ, రెండు పార్టీలూ సిద్ధాంతపరంగా సహజ భాగస్వాములని, విజయ్–రాహుల్ గాంధీ మధ్య స్నేహం ఉందని పేర్కొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!