

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను తాను వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకుని సంచలనం సృష్టించారు. తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో వికీపీడియా పేజీని పోలిన ఎడిటెడ్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేసి, ఈ ఏడాది జనవరి నుంచి వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినట్లు సూచించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరుతో వెనెజువెలాపై అమెరికా మెరుపుదాడులు చేపట్టిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. రాజధాని కారకాస్‌పై దాడి చేసి, వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అమెరికా బలగాలు నిర్బంధించి తరలించాయి. దీంతో వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్ 90 రోజుల పాటు తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.
వెనెజువెలా పూర్తిస్థాయి అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపడతారన్న సందిగ్ధం నడుమ ట్రంప్ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. విపక్ష నేత, నోబెల్ పురస్కార గ్రహీత మరియా కోరినా మచాడోకు అధికారం అప్పగించవచ్చనే ప్రచారం జరిగినా, ఆమెకు ప్రజల్లో తగిన మద్దతు లేదంటూ ట్రంప్ విముఖత చూపించారు. మదురోపై కేసులకు ఆ డబ్బును ఖర్చు చేయవద్దంటూ కూడా ఆయన సూచించారు. ప్రస్తుతం ట్రంప్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా, ఇది రాజకీయ వ్యూహమా లేక సెటైరా అన్న చర్చలు సాగుతున్నాయి.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!