

బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత తలసాని శ్రీనివాస యాదవ్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు కేవలం 23 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలిపారు. గత ఎన్నికల్లో ఓటు వేసిన పట్టభద్రులు మళ్లీ ఎందుకు నమోదు చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. ఓటర్ల నమోదులో ఉన్న ఇబ్బందులను తొలగించి ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రేపు, ఎల్లుండి నియోజకవర్గాల వారీగా విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తామని, సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ)ను కలిసి సమస్యలను వివరిస్తామని చెప్పారు.
రాష్ట్రంలో విద్యుత్, తాగునీరు, సాగునీటి సమస్యలపై కూడా తలసాని ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించుకోవాలని, అవసరమైతే ప్రతిపక్షాల సలహాలు తీసుకోవాలని సూచించారు. కేసీఆర్ హయాంలో విద్యుత్, తాగునీరు, సాగునీటి సరఫరా ఎలా ఉండేదో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం బీఆర్ఎస్‌ను పదేపదే ప్రస్తావిస్తోందంటే తమ పార్టీపై భయం ఉందని విమర్శించారు. ప్రస్తుత పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొంటూ, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీలు వాణీదేవి, దాసోజు శ్రవణ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు క్రిశాంక్, గజ్జల నగేష్, అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!