

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు సమస్యలు తెరపైకి వచ్చాయి. మేయర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులతో పాటు వార్డులు, డివిజన్ల కేటాయింపులపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పరస్పరం పోటీకి దిగుతున్నారు. మూడు కార్పొరేషన్ల మేయర్ పదవులతో పాటు 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్‌పర్సన్ స్థానాల్లో కూటమి పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నట్లు సమాచారం. విజయనగరం, ఏలూరు, విశాఖపట్నం కార్పొరేషన్లతో పాటు విజయవాడ, కర్నూలు ప్రాంతాల్లోనూ వార్డులు, డివిజన్ల కేటాయింపులపై వివాదాలు తలెత్తాయి. కొన్ని చోట్ల ఒకే పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.
ఇచ్ఛాపురం, పలాస, సాలూరు, పార్వతీపురం, పాలకొండ, నెల్లిమర్ల, రామచంద్రపురం, గూడూరు, ఎర్రగుంట్ల, డోన్, ఆదోని వంటి పట్టణాల్లోనూ ఛైర్‌పర్సన్ పదవులు, అభ్యర్థుల ఎంపికపై కూటమి పార్టీల మధ్య పోటీ నెలకొంది. తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట వంటి ప్రాంతాల్లో ఒకే పార్టీ అభ్యర్థులపై అదే పార్టీకి చెందిన ఇతర నేతలు నామినేషన్లు వేశారు. అనంతపురం, నర్సీపట్నం, ఎలమంచిలి, గిద్దలూరు, పెనుకొండ, తిరుపతి సహా పలు ప్రాంతాల్లోనూ మిత్రపక్షాల అభ్యర్థులు పరస్పరం పోటీ పడుతున్నారు. వార్డులు, డివిజన్ల కేటాయింపులపై చర్చలు పూర్తికాకపోవడంతో రెబల్ అభ్యర్థుల సమస్య మరింత క్లిష్టంగా మారింది. నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా పార్టీ నాయకులు జోక్యం చేసుకుని అసంతృప్త నేతలను బుజ్జగించి, పోటీని తగ్గించేందుకు ప్రయత్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!