

తెలంగాణలో కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. గజ్వేల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కాలం తెచ్చిన కరువు కాదని అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు పది నెలల ముందే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని, ముఖ్యంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజలు తాగునీరు, సాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని హరీశ్ రావు అన్నారు. ఇతర రాష్ట్రాలు ఇప్పటికే కరువు మండలాలను ప్రకటించి, రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నాయని, తాగునీటి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం నిధులు విడుదల చేస్తున్నాయని తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు కరువు మండలాలను ప్రకటించలేదని, రైతులకు తక్షణ సాయం అందించలేదని విమర్శించారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల విషయంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కరువు పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడంతో పాటు తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!