

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానానికి రాజకీయంగా నిధులు సమకూర్చాల్సి వస్తుందనే భయంతో ప్రతిపాదిత విదేశీ బొగ్గు కొనుగోళ్లలో కమీషన్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో నర్సంపేట నియోజకవర్గ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ హైకమాండ్‌కు డబ్బులు పంపకపోతే ముఖ్యమంత్రి పదవి కొనసాగదనే భయంతో రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విదేశీ బొగ్గు కొనుగోళ్ల వ్యవహారంతో పాటు, సింగరేణిలో తన బావమరిది ప్రమేయం ఉందని తాము ఆరోపిస్తున్న రూ.10 వేల కోట్ల కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. సింగరేణిలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన అక్రమాలను కూడా బయటపెడతామని అన్నారు. బొగ్గు ఉత్పత్తి తగ్గడం వల్లే విద్యుత్ కేంద్రాల్లో కొరత ఏర్పడిందని, సింగరేణికి చెల్లించాల్సిన సుమారు రూ.60 వేల కోట్ల బకాయిలను పెండింగ్‌లో పెట్టి సంస్థను బదనాం చేస్తున్నారని ఆరోపించారు.
సాగునీరు, కరువు పరిస్థితులపై కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో స్పందించలేదని కేటీఆర్ విమర్శించారు. దాదాపు వెయ్యి టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలేశారని ఆరోపిస్తూ, ఎల్‌నినో ప్రభావం ఇతర రాష్ట్రాలపై కూడా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు నీటి నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నీటి వనరుల నిర్వహణపై కార్యక్రమాలు జరుగుతుండగా, తెలంగాణలో కరువు పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్ష మేరకు బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఓటు హక్కు కల్పించేలా ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని సూచించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!