

హైదరాబాద్ నగరంలోని ప్రముఖ రహదారులకు ప్రముఖ వ్యక్తులు మరియు ప్రముఖ సంస్థల పేర్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా, రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు సాగిన 100 మీటర్ల వెడల్పు గల గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు కు పారిశ్రామికవేత్త రతన్ టాటా పేరును ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. రావిర్యాల ఇంటర్చేంజ్కి ఇప్పటికే ‘టాటా ఇంటర్చేంజ్’ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.
అదే విధంగా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరును కూడా నగరంలోని ఒక ముఖ్య రహదారికి ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఎదుటుగా వెళ్లే ప్రధాన రహదారిని ‘డోనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా పిలవాలనే ప్రతిపాదన సిద్ధమైంది. ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడా రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టనందున, ఇది అంతర్జాతీయంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
ఈ నామకరణం పై తుది నిర్ణయం రావడానికి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు అమెరికా రాయబారి కార్యాలయానికి అధికారిక లేఖలు పంపాలని ప్రభుత్వం సిద్ధమైంది.
ఐటీ కారిడార్లోని కొన్ని ప్రధాన మార్గాలకు గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ వంటి పేర్లను పరిశీలిస్తున్నట్లు కూడా సమాచారం. ప్రపంచంలో పెద్ద సంస్థలు, ప్రభావవంతమైన నాయకుల పేర్లు రహదారులకు ఇవ్వడం ద్వారా వారికి గౌరవం ఇవ్వడమే కాకుండా, హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ మార్గాల్లో ప్రయాణించే వారికి కూడా ఇవి స్ఫూర్తి కలిగించేలా ఉంటాయన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!