

బొగ్గు దిగుమతుల పేరుతో తెలంగాణలో రూ.3 వేల కోట్ల కుంభకోణానికి కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. విదేశీ బొగ్గు దిగుమతుల ముసుగులో భారీ అక్రమాలకు ప్రణాళికలు రచిస్తున్నారని, భోత్రా లాజిస్టిక్స్ అనే అనుమానాస్పద సంస్థతో ముఖ్యమంత్రి ముందుగానే రహస్య ఒప్పందం చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. కృత్రిమంగా బొగ్గు కొరతను సృష్టించి, విద్యుత్ సంక్షోభాన్ని తెరపైకి తీసుకొచ్చిన అనంతరం ఆ సంస్థను రంగంలోకి దించారని ఆయన పేర్కొన్నారు.
భోత్రా లాజిస్టిక్స్తో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ చేసుకున్న ఒప్పందాలను బహిర్గతం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఈ తరహా వ్యవహారాలను అడ్డుకోవాల్సింది పోయి, వాటికి సహకరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న కుట్రలను చూస్తూ ఊరుకోబోమని కేటీఆర్ స్పష్టం చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!