

కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి వ్యతిరేకంగా కొత్త పార్టీ ఆవిర్భవించింది. ‘లాల్ హిట్ జనతా పార్టీ(ఎల్హెచ్పీ)’ పేరుతో ఆ పార్టీని ఆదివారం ఢిల్లీలోని మాలవీయ భవన్లో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మొదటిసారిగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత ఆ పార్టీ చీఫ్ అయాన్ భట్నాగర్ మాట్లాడారు. సీజేపీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా విమర్శలు చేశారు. ఇటీవలే దేశంలో జరిగిన ప్రదర్శనలు రాజ్యాంగబద్ధ వ్యవస్థలను ప్రశ్నించాయని, అంతేకాకుండా ఢిల్లీలో వ్యాపారులకు నష్టం కలిగించాయని ఆరోపించారు. త్వరలో తమ కార్యాచరణను వెల్లడిస్తామని చెప్పారు. తక్కువ సమయంలో ఎక్కువ మందిని సమీకరించడానికి ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇస్తే, ఎంత మంది జనం వస్తారోనని ఊహించడానికే ఆశ్చర్యంగా ఉందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరాను మనం నిర్వహించుకుంటామన్నారు.
ప్రజలు సోషల్ మీడియాకే పరిమితం కాకుండా వీధుల్లోకి వెళ్లి నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అయాన్ తన ప్రసంగంలో నిరసనకారులను ఉద్దేశిస్తూ కీటకాలు, బొద్దింకలు వంటి జీవుల వంటి పదాలను ఉపయోగించారు. దసరా నుంచి దీపావళి వరకు దేశవ్యాప్తంగా వ్యాపారులకు అత్యంత ఎక్కువ వ్యాపారం జరిగే కాలమని ఆయన పేర్కొన్నారు. అలాంటి సమయంలో ఢిల్లీలోని కన్నౌట్ ప్లేస్ వంటి ప్రధాన వాణిజ్య ప్రాంతంలో ప్రదర్శనలు నిర్వహించి వ్యాపారులకు సీజేపీ నేతలు ఆటంకం కలిగించారని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ సహా పలు మహానగరాల్లో నిరసనకారులు కార్యకలాపాలకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!