

ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య కొఠియా గ్రామాలపై కొనసాగుతున్న సరిహద్దు వివాదం మరోసారి తీవ్రరూపం దాల్చింది. వివాదాస్పద ప్రాంతంలోని మూడు గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా ప్రకటించి స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు పార్వతీపురం మన్యం జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేయడంతో ఒడిశా అధికారులు, రాజకీయ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు జరగనుండగా, నామినేషన్ల ప్రక్రియ అక్టోబర్ 23తో ముగియనుంది. కొరాపుట్ జిల్లాలోని పొట్టంగి ప్రాంతం, ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం పరిధిలోని 21 గ్రామాలపై రెండు రాష్ట్రాల మధ్య చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒడిశా రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ పూజారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అడ్వకేట్ జనరల్, దక్షిణ రెవెన్యూ కమిషనర్, కొరాపుట్ కలెక్టర్‌తో చర్చించిన అనంతరం, రాష్ట్ర భౌగోళిక సమగ్రతను కాపాడేందుకు సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. వివాదాస్పద ప్రాంతంలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు పోలీసు, రెవెన్యూ శాఖల ప్రత్యేక అధికారులను నియమించారు. కొరాపుట్ సబ్ కలెక్టర్, నోడల్ అధికారి ఫాబీ రషీద్ కూడా గ్రామాల్లో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కొఠియా వివాదం ఒడిశా రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన మంత్రి సురేష్ పూజారి, గత బిజూ జనతాదళ్ (బీజేడీ) ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే సమస్య ఇంతవరకు వచ్చిందని ఆరోపించారు. ఒడిశా పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్, కొరాపుట్ కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక కూడా ఎన్నికల నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. మాజీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్ని రాజకీయ పార్టీలు విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. కొఠియా ప్రాంతంపై వివాదం నేపథ్యంలో ఒడిశా 1968లో సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, ఈ అంశంపై న్యాయపరమైన వివాదం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాన్ని ఒడిశా పరిశీలిస్తోంది. మరోవైపు, వివాదాస్పద గ్రామాల్లో ఎన్నికలను వ్యతిరేకించేందుకు జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలు ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!