

మాజీ ఐఏఎస్ అధికారి దివ్యా మిట్టల్ తన కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. ‘జన నీతి భారత్’ పేరుతో పార్టీని ప్రారంభించిన ఆమె, 2027లో ఉత్తరప్రదేశ్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. విధాన రూపకల్పనలో ప్రజలను కేంద్రబిందువుగా ఉంచడం, ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీగా మార్చడం తమ పార్టీ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. ప్రజా సమస్యలను వినడమే కాకుండా, వాటి పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ‘రాజకీయాలు కాదు.. జన నీతి’ అనే నినాదంతో ప్రజా కేంద్రిత పాలనను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు వివరించారు.
ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో విద్యనభ్యసించిన దివ్యా మిట్టల్ గతంలో వాల్స్ట్రీట్ ట్రేడర్గా పనిచేశారు. అనంతరం సుమారు 13 ఏళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా సేవలందించారు. ఆగస్టు 30న ఆమె తన పదవికి రాజీనామా చేయగా, సెప్టెంబర్ 29న రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో రాజకీయ పార్టీలకు కొరత లేదని, ప్రజల సమస్యలను నిజంగా ఆలకించే పార్టీల అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. జన నీతి భారత్కు ప్రచార ప్రకటనల కోసం పెద్దగా నిధులు లేవని, ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలిపారు. తమ పార్టీ ప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని పేర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!