

తమిళ సినీ నటుడు ధనుష్ రాజకీయ ఆరంగేట్రంపై తమిళనాడులో ఊహాగానాలు ఊపందుకున్నాయి. చెన్నైలో 58 జిల్లాల నుంచి వచ్చిన 2,500 మందికి పైగా మహిళా అభిమానులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభిమానులకు వెండి దీపాలను బహుమతిగా అందజేశారు. అయితే, ఆ దీపాలపై కమలం గుర్తు కనిపించడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ధనుష్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారనే ప్రచారానికి ఈ పరిణామం మరింత ఊతమిచ్చింది. ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో పార్టీని ప్రారంభించనున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ తరహాలో అభిమానుల బలాన్ని రాజకీయ మద్దతుగా మార్చుకునే ప్రయత్నంలో ధనుష్ ఉన్నారనే విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి.
అయితే, వెండి దీపాలపై ఉన్న కమలం గుర్తుకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ధనుష్ నర్పణి ఇయక్కం ప్రతినిధి స్పష్టం చేసినట్లు సమాచారం. అది దీపాల తయారీదారుకు చెందిన ముద్ర మాత్రమేనని వివరణ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారంపై నెలకొన్న చర్చకు తెరదించే ప్రయత్నం చేశారు. మరోవైపు, ధనుష్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం కొనసాగుతున్నప్పటికీ, ఆయన ఇప్పటివరకు తన రాజకీయ ఆరంగేట్రంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అభిమానులతో నిర్వహించిన సమావేశం, పార్టీ ఏర్పాటుపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన తదుపరి అడుగులపై ఆసక్తి నెలకొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!