

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేందుకు వైసీపీ హింసాత్మక ఘటనలను ప్రోత్సహించిందని ఆరోపించారు. పుంగనూరు, రాయచోటి, కనిగిరి, దర్శి, కడప, తంబళ్లపల్లె, తిరుపతి తదితర ప్రాంతాల్లో జరిగినట్లు పేర్కొన్న ఘటనల వీడియోలను ప్రదర్శించారు. ‘అదే హింస.. అవే అబద్ధాలు.. అవే అరాచకాలు’ పేరుతో వైసీపీపై ఆరోపణలను వివరిస్తూ బుక్‌లెట్‌ను విడుదల చేశారు. గత పాలనలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారని విమర్శించిన చంద్రబాబు, ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవిస్తూ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారమే తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు.
వైసీపీ హింసకు పాల్పడుతూ, అదే సమయంలో కోర్టులను ఆశ్రయించి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. నామినేషన్ కేంద్రాల్లో పత్రాలు లాక్కోవడం, పార్టీ కార్యాలయాలపై దాడులు, వాహనాల ధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో జరిగిన ఘటనలపై ప్రజల్లో చర్చ జరగాలని అన్నారు. మరోవైపు, 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 57 శాతం ఓట్లతో ప్రజల మద్దతు పొందిందని, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి సారించామని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, పరిశ్రమల స్థాపనను వేగవంతం చేయడం ద్వారా ఉద్యోగావకాశాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం, న్యాయస్థానాల ఆదేశాలను గౌరవిస్తామని, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటమే ప్రభుత్వ ప్రాధాన్యమని చంద్రబాబు తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!