

సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ, అవినీతి నుంచి కాపాడటంతో పాటు బొగ్గు గని కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను బలహీనపరిచే ప్రయత్నాలను అడ్డుకుంటామని, కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని పేర్కొన్నారు. గోదావరిఖనిలో ఇటీవల నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన సభ విజయవంతమైన నేపథ్యంలో గురువారం తెలంగాణ భవన్‌లో సింగరేణి ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నేతలతో ఆయన సమావేశమయ్యారు. సంస్థ ప్రస్తుత పరిస్థితులు, కార్మికుల సమస్యలు, టెండర్ల వ్యవహారాలు, ఆర్థిక అంశాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. కార్మిక గర్జన సభను విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, కార్మిక సంఘం నేతలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికుల కోసం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, లాభాల్లో వాటా, ఆధారిత ఉద్యోగాలు, వైద్య సదుపాయాలు, కార్మిక కుటుంబాలకు అందించిన ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. కార్మికులకు రావాల్సిన బోనస్, లాభాల వాటా, ఇతర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. సింగరేణి విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని కూడా నిలదీయాలని అన్నారు. రానున్న సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలకు పార్టీ శ్రేణులు, టీబీజీకేఎస్ నాయకులు సిద్ధం కావాలని సూచించారు. సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, కార్మిక సంఘం బలోపేతమే లక్ష్యంగా సమన్వయంతో ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!