

కాంగ్రెస్, సీజేపీ నేతృత్వంలో జరుగుతున్న నిరసనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని రాజ్యసభ సభ్యుడు, భాజపా నేత డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. న్యాయస్థానాలు, రాజ్యాంగ సంస్థలపై ప్రజల్లో అపనమ్మకం కలిగించేలా విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. అధికారమే లక్ష్యంగా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారని విమర్శించిన ఆయన.. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా ప్రక్షాళనపై ఆధారాలతో మాట్లాడాలని సూచించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్, అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడటంతో పాటు ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
నిరసనల పేరుతో చట్టాన్ని ఉల్లంఘించడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని లక్ష్మణ్ అన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చినప్పటికీ, విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు భాజపా అక్టోబర్ 23 నుంచి నవంబర్ 5 వరకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధాన నగరాల్లో సభలు, విద్యావంతులు, మేధావులతో ‘చింతన్ సంవాద్’, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 200 మందితో సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇవి విపక్షాల ఆరోపణలకు సమాధానం ఇచ్చేలా ఉంటాయని పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!