

గత వారం తమిళనాడులో ఎన్నికలు జరిగాయి. ఈసారి నటుడు విజయ్ తొలిసారి రాజకీయాల్లోకి అడుగుపెట్టి పోటీ చేశాడు. అదే సమయంలో అతడిని టార్గెట్ చేస్తూ తీసినట్టు భావిస్తున్న ‘టీఎన్ 2026’ సినిమా ఎన్నికల ముందు థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు రాకముందే కేవలం మూడు వారాల్లోనే ఓటీటీలోకి రావడానికి సిద్ధమైంది.
విజయ్ తమిళ వెట్రి కళగం అనే పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ‘టీఎన్ 2026’ సినిమా ఒక ప్రముఖ సినీ నటుడు రాజకీయాల్లోకి వచ్చి కొత్త పార్టీ స్థాపించడం, ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితులను రాజకీయ వ్యంగ్యంగా చూపిస్తుంది. ఈ కథను తంబి రామయ్య అందించగా, ఆయన కుమారుడు ఉమాపతి రామయ్య దర్శకత్వం వహించాడు. నటరాజన్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ నెల 10న విడుదలైన ఈ చిత్రం రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్, ఆహా, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్, ఏపీ ఇంటర్నేషనల్ వేదికల్లో ప్రసారం కానుంది.
ఈ సినిమా విజయ్ను టార్గెట్ చేస్తూ తీశారని కొందరు అభిమానులు భావించినప్పటికీ, ఇది పూర్తిగా కల్పిత కథ మాత్రమేనని తంబి రామయ్య తెలిపారు. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో ఎలా స్పందన పొందుతుందో చూడాలి. అలాగే ఈ సినిమా తెలుగులో వస్తుందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!