

భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ వెండితెరపై మరోసారి అద్భుత దృశ్యరూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2026 నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిత్రానికి సంబంధించిన తమిళ ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న సాయిపల్లవి, సీత పాత్రలో తాను కనిపించనున్న ఈ సినిమాను ప్రేక్షకులు 3డీలో థియేటర్లలో చూడాలని కోరారు. మొబైల్ ఫోన్‌లో ట్రైలర్ చూడటానికి, పెద్ద తెరపై 3డీలో అదే దృశ్యాలను ఆస్వాదించడానికి చాలా తేడా ఉంటుందని ఆమె వివరించారు. చిత్రంలోని విజువల్స్‌ను పూర్తిస్థాయిలో అనుభూతి చెందాలంటే థియేటర్లలోనే చూడాలని ప్రేక్షకులకు సూచించారు.
నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ సినిమాను రూపొందించడంలో పెట్టుకున్న లక్ష్యాన్ని కూడా సాయిపల్లవి ప్రస్తావించారు. ‘రామాయణం’ను సాధారణమైన లేదా నాణ్యతలేని చిత్రంగా తెరకెక్కించడం ఆయనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కూడా వెంట తీసుకెళ్లి ఈ చిత్రాన్ని 3డీలో థియేటర్లలో చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే గొప్ప కథగా తాను అభివర్ణించిన ‘రామాయణం’ను తెరపైకి తీసుకొచ్చినందుకు చిత్ర బృందం గర్వంగా ఉందని ఆమె అన్నారు. భారత్‌లో ఈ కార్యక్రమమే చివరి ప్రచార కార్యక్రమమని, ఇకపై చిత్ర బృందం విదేశాల్లో ప్రచారాన్ని కొనసాగించనుందని తెలిపారు. ఈ చిత్రంలో రవి దూబే, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, ఇందిరా కృష్ణన్, కునాల్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. హాన్స్ జిమ్మర్ నేపథ్య సంగీతానికి పనిచేయగా, ఏ.ఆర్. రెహమాన్ పాటలకు సంగీతం అందించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!