

తెరపై భావోద్వేగభరితమైన నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించగల వెంకటేశ్, కుటుంబ కథా చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ముత్యాల సుబ్బయ్య, సహజ నటనతో అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న సౌందర్య కలయికలో వచ్చిన క్లాసిక్ చిత్రం ‘పవిత్రబంధం’. 1996 అక్టోబర్ 17న విడుదలైన ఈ సినిమా నేటితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. అగ్రిమెంట్ మ్యారేజ్ అనే విభిన్నమైన కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ చిత్రం.. పెళ్లి, ప్రేమ, పరస్పర గౌరవం, కుటుంబ బాధ్యతల విలువను హృద్యంగా ఆవిష్కరించింది. వైవాహిక బంధాన్ని పెద్దగా పట్టించుకోని సంపన్న యువకుడిగా వెంకటేశ్ నటించగా, భర్త ప్రేమ కోసం పరితపించే సంప్రదాయ యువతిగా సౌందర్య ఆకట్టుకున్నారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఒకరి పట్ల మరొకరు గౌరవాన్ని చాటుకునే సన్నివేశాలు ప్రేక్షకులను కదిలించాయి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం, పోసాని కృష్ణమురళి సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతం ‘పవిత్రబంధం’ విజయానికి మరో ప్రధాన కారణం. ప్రముఖ గాయకుడు కె.జె. ఏసుదాసు ఆలపించిన ‘అపురూపమైనదమ్మ ఆడజన్మ’ పాట ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా బంగారు నంది పురస్కారాన్ని అందుకోగా, సౌందర్య ఉత్తమ నటిగా, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డులు గెలుచుకున్నారు. తెలుగులో ఘనవిజయం సాధించిన ఈ కథ ఇతర భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. దీంతో కన్నడ, హిందీ, తమిళం, బెంగాలీ, ఒడియా భాషల్లో రీమేక్ చేయడంతోపాటు బంగ్లాదేశ్లోనూ ఈ కథను తెరకెక్కించారు. భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ, వైవాహిక బంధంలోని గొప్పతనాన్ని చాటిచెప్పిన ‘పవిత్రబంధం’ మూడు దశాబ్దాల తర్వాత కూడా తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!