

బాలీవుడ్ నటి కృతి సనన్ సోషల్ మీడియాలో నటీమణులు ఎదుర్కొంటున్న ట్రోలింగ్‌పై స్పందించారు. సాధారణంగా విమర్శలను పట్టించుకోనని, వాటికి ప్రాధాన్యం ఇవ్వకుండా ముందుకు సాగుతానని ఆమె తెలిపారు. అయితే, ఇటీవల ఓ వాణిజ్య ప్రకటనలో తాను ధరించిన దుస్తులపై పెద్ద ఎత్తున చర్చ జరగడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని వెల్లడించారు. ఆ దుస్తుల అంశం ఏకంగా ప్రైమ్‌టైమ్ న్యూస్ చర్చకు దారితీయడం చూసి షాక్ అయ్యానని చెప్పారు. ఆ సమయంలో అందరికీ విలన్‌లా కనిపించినా సరే, గట్టిగా స్పందించాలని అనిపించిందని పేర్కొన్నారు. ఇది తన ఒక్కరి సమస్య కాదని, ఎంతోమంది మహిళలు ఇలాంటి విమర్శలు, ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారని కృతి ఆవేదన వ్యక్తం చేశారు. నటీమణుల వ్యక్తిగత రూపురేఖలు, దుస్తులపై అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని, మహిళలపై జరుగుతున్న ట్రోలింగ్ వారిపై మానసిక ప్రభావాన్ని చూపుతుందని అభిప్రాయపడ్డారు. తాము కూడా మనుషులమేనని, ఇలాంటి వ్యాఖ్యలు తమను బాధిస్తాయని ఆమె స్పష్టం చేశారు.
మరోవైపు, చిత్ర పరిశ్రమలో మహిళా ప్రధాన చిత్రాలకు ప్రాధాన్యం పెరుగుతుండటంపై కృతి సనన్ సంతోషం వ్యక్తం చేశారు. ఓటీటీతోపాటు థియేటర్లలోనూ బలమైన పాత్రలకు, కథలకు ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ మార్పు పరిశ్రమకు శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. త్వరలో తాను సోలో లీడ్‌గా ఓ చిత్రంలో నటించనున్నట్లు వెల్లడించారు. హీరోల ప్రధాన పాత్రల్లో రూపొందే సినిమాల మాదిరిగానే మహిళా ప్రధాన చిత్రాలు కూడా భారీ వసూళ్లు సాధించి, ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. మహిళా ప్రధాన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమైతే పరిశ్రమలో మరిన్ని మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా నటీమణులకు బలమైన పాత్రలు లభించడంతోపాటు, వారి చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ పెరగడం ద్వారా సమాన అవకాశాలకు మార్గం సుగమమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!