

సినీ పరిశ్రమలోకి సాధారణంగా ఉండే మార్గాలకు భిన్నంగా అనుప్రియ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ముంబయికి చెందిన ఆమె యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బాత్‌లో ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఫైనల్ ఇయర్‌లో భాగంగా ప్రముఖ టెక్నాలజీ కంపెనీలు ఎలా పనిచేస్తాయి? సంస్థల వ్యవస్థాపకులకు కొత్త ఆలోచనలు ఎలా వస్తాయి? అనే అంశాలపై పరిశోధన చేస్తున్న సమయంలో ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌కు భారత ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబాతో ఉన్న సంబంధం గురించి తెలుసుకున్నారు. 1974లో జాబ్స్ ఉత్తరాఖండ్‌లోని కైంచి ధామ్ ఆశ్రమాన్ని సందర్శించినట్లు చదివిన అనుప్రియ ఫేస్‌బుక్ ప్రారంభ దశలో సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు మార్క్ జుకర్‌బర్గ్ కూడా జాబ్స్ సలహా కోరారని, కైంచి ధామ్‌కు వెళ్లాలని సూచించినట్లు తెలుసుకున్నారు. ఈ వివరాలు ఆమెకు మరింత ఆసక్తిని కలిగించడంతో నీమ్ కరోలీ బాబా జీవితం, ప్రభావంపై లోతుగా పరిశోధించాలని నిర్ణయించుకున్నారు.
మొదట తన పరిశోధనను పుస్తకం లేదా కామిక్ రూపంలో తీసుకురావాలని భావించిన అనుప్రియ అనుకోకుండా భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో నీమ్ కరోలీ బాబా జీవితంపై సినిమా రూపొందిస్తున్న దర్శకుడు విశాల్ చతుర్వేదిని కలవడం ఆమె జీవితంలో కీలక మలుపుగా మారింది. స్విట్జర్లాండ్‌లో ఉద్యోగం చేయాలన్న ఆలోచనను పక్కనపెట్టి ఈ చిత్రానికి సహ నిర్మాతగా మారారు. సినిమా విడుదలైన మొదటి వారంలో పెద్దగా వసూళ్లు రాకపోయినా, చిత్రంపై వచ్చిన మౌఖిక ప్రచారంతో తర్వాత రోజుల్లో కలెక్షన్లు పెరిగి సినిమా విజయవంతమైంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ చిత్రానికి పన్ను మినహాయింపు కూడా ఇచ్చింది. కళలపై ఆసక్తి ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అనుప్రియ విద్యార్థి దశలో ఆర్ట్, డ్యాన్స్‌తో పాటు యూనివర్సిటీ బిజినెస్ సొసైటీల్లో చురుకుగా వ్యవహరించారు. అందుకే కథలు చెప్పడం తన జీవితంలో భాగమైందని ఆమె చెబుతున్నారు. ఈ చిత్రం ఇచ్చిన విజయంతో రెండో భాగాన్ని కూడా రూపొందించనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!