

నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు నిర్మాతగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. తన సొంత నిర్మాణ సంస్థ ‘పీఆర్ షో’ బ్యానర్‌పై ‘పీఆర్‌ఎస్01’ అనే వర్కింగ్ టైటిల్‌తో మహిళా ప్రధాన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం తొలుత ‘డ్రాగన్’ దర్శకుడు అశ్వత్ మారిముత్తును అనుకున్నప్పటికీ, ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో టాలీవుడ్ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘ప్రేమలు’తో యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మమితా బైజు ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించనుంది.
ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రదీప్ రంగనాథన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన ఆరుగురు యువ దర్శకుల బృందం ‘ది ఆల్ఫా యూనిట్’ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది. ప్రస్తుతం సంగీత రంగంలో గుర్తింపు పొందుతున్న సాయి అభ్యంకర్ ఈ ప్రాజెక్ట్‌కు సంగీతం అందిస్తున్నారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించేలా ప్రదీప్ రంగనాథన్ నిర్మాణ సంస్థను ప్రారంభించడం, యువ దర్శకుల బృందానికి అవకాశం ఇవ్వడం ఆసక్తిని పెంచుతోంది. తరుణ్ భాస్కర్, మమితా బైజు కలయికతో రూపొందుతున్న ఈ చిత్రం గురించి మరిన్ని వివరాల కోసం సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!