

ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు వరుస అవకాశాలు అందుకున్న తెలుగు దర్శకులు ఇప్పుడు విజయాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచులు మారుతున్న నేపథ్యంలో పాత పద్ధతులతో సినిమాలు తీస్తే ఆదరణ తగ్గుతోంది. దీంతో పూరి జగన్నాధ్, శ్రీనువైట్ల, హరీష్ శంకర్, బోయపాటి వంటి దర్శకులు మళ్లీ తమ సత్తా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బద్రి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న పూరి జగన్నాధ్ ఇటీవల విజయాలకు దూరమయ్యారు. ఇప్పుడు విజయ్ సేతుపతి హీరోగా స్లమ్ డాగ్ రూపొందించారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ఫలితంపైనే ఆయన తదుపరి అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. మరోవైపు, తనదైన హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీనువైట్ల కథల్లో కొత్తదనం లోపించడంతో వెనుకబడ్డారు. ప్రస్తుతం శర్వానంద్‌తో చేస్తున్న సినిమా ఆయన కెరీర్‌కు కీలకంగా మారింది.
మిరపకాయ్, గబ్బర్ సింగ్ విజయాలతో గుర్తింపు పొందిన హరీష్ శంకర్‌కు ఆ తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. మిస్టర్ బచ్చన్, ఉస్తాద్ భగత్ సింగ్ నిరాశపరచడంతో తదుపరి కథపై దృష్టి పెట్టారు. ఇక భద్ర, తులసి, సింహ, లెజెండ్ చిత్రాలతో విజయాలు అందుకున్న బోయపాటి కూడా ఇటీవల ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. బాలయ్యతో అఖండ విజయవంతమైనప్పటికీ, రామ్‌తో చేసిన స్కంద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. గత సంవత్సరం విడుదలైన అఖండ 2 కూడా భారీ పరాజయంగా నిలిచింది. దీంతో ఈ దర్శకుల తదుపరి అడుగులపై ఆసక్తి నెలకొంది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగ్గ కథలు, కొత్తదనం, బలమైన కథనంతో ముందుకొస్తేనే వీరికి మళ్లీ పూర్వవైభవం దక్కే అవకాశముంది. మరి ఈ సీనియర్ దర్శకుల్లో ఎవరు ముందుగా కం బ్యాక్ ఇస్తారో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!