

గత పదేళ్లుగా దక్షిణాది ప్రేక్షకులను తన నటనతో బాగా ఆకట్టుకున్న నటీమణుల్లో కీర్తి సురేష్ పేరు ముందుగా వస్తుంది. ‘మహానటి’ తో వచ్చిన భారీ విజయం ఆమెను తెలుగు మాత్రమే కాదు, మొత్తం సౌత్ ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఆ తర్వాత కూడా కీర్తి ఎన్నో భాషల్లో సినిమాలు చేస్తూ, తనకంటూ ఒక బలమైన స్థానం సంపాదించుకుంది.
కెరీర్ పీక్‌లో ఉండగానే కీర్తి తన చిరకాల ప్రియుడు ఆంటోని తటిల్ ను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరి ప్రేమకథ గురించి బయటికి వచ్చినది పెళ్లికి కొద్దికాలం ముందే. కానీ కీర్తి తాజాగా చెప్పినట్లుగా, వీరి ప్రేమకు దాదాపు పదిహేనేళ్ల చరిత్ర ఉందట.
కళాశాల రోజుల్లోనే ఈ ప్రేమ మొదలై, కాలంతో మరింత బలపడిందని కీర్తి చెబుతుంది. అప్పుడు ఇద్దరూ తమ కెరీర్ల పై దృష్టి పెట్టి, సరైన సమయం వచ్చినప్పుడు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కీర్తి వారి ప్రేమకథ లోని కొన్ని హృద్యమైన, ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ముఖ్యంగా ఆంటోనిని తానే కొంచెం ఆటపట్టించి చివరకు ప్రపోజ్ చేయించుకున్నా అని చిరునవ్వుతో చెప్పింది.
ఆర్కుట్ రోజుల్లోనే వీరి పరిచయం మొదలైందట. ముఖాముఖిగా కలుసుకునే లోపే నెలరోజుల పాటు ఇద్దరూ చాట్ చేస్తూ మంచి స్నేహం పెంచుకున్నారు. తర్వాత కొచ్చిన్ లోని ఓ రెస్టారెంట్లో మొదటిసారి ఎదురుపడ్డారట. ఆ సమయంలో మాటలు ప్రత్యేకంగా మాట్లాడకపోయినా, బయటికి వస్తూ కీర్తి చేసిన చిన్న కన్నుకొట్టింపు ఆంటోనిని పూర్తిగా షాక్‌కు గురి చేసిందట.
కొద్ది రోజుల తర్వాత మాల్ లో మళ్లీ యాదృచ్ఛికంగా కలిసినప్పుడు,
“నీకు నిజంగా ధైర్యం ఉంటే నాకు ప్రపోజ్ చేయి చూద్దాం”
అని కీర్తి సరదాగా సవాల్ విసిరిందట. అలాంటి సవాల్‌కు స్పందించకుండా ఉండటం ఏ అబ్బాయికైనా కష్టం కదా. చివరకు కొత్త సంవత్సరం రోజున ఆంటోని తన భావాలను ధైర్యంగా చెప్పి, కీర్తికి అధికారికంగా ప్రపోజ్ చేశాడట. వెంటనే కీర్తి కూడా హృదయ పూర్వకంగా అంగీకరించిందని, అలా వారి ప్రేమకథ ఒక అందమైన ప్రయాణంగా మొదలైందని ఆమె సంతోషంగా గుర్తుచేసుకుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!