

మాస్ మహారాజా రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ చిత్రంపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాల ఆధారంగా రవితేజ అయ్యప్ప మాల ధరించిన భక్తుడి పాత్రలో కనిపించనున్నారని భావించిన అభిమానులకు, తాజా సమాచారం కొత్త ఆసక్తిని కలిగిస్తోంది. సినిమా ప్రారంభ భాగం రక్తికట్టించే యాక్షన్ సన్నివేశాలతో సాగుతుందని, కథానాయకుడికి నేర ప్రపంచంతో బలమైన అనుబంధం ఉంటుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఆ తర్వాత కథ భావోద్వేగ మలుపు తిరుగుతుందని సమాచారం. తన కుమార్తె భవిష్యత్తు కోసం హింసాత్మక గతాన్ని వదిలి అయ్యప్ప దీక్ష స్వీకరించిన హీరో జీవితంలో పాత శత్రువులు మళ్లీ ప్రవేశించడంతో సంఘటనలు ఊహించని మలుపు తిరుగుతాయి. యాక్షన్తో పాటు బలమైన భావోద్వేగాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, బేబీ నక్షత్ర రవితేజ కుమార్తె పాత్రలో కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సినిమా ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!