

తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ అంటే కేవలం హీరో కాదు-ఆ పేరు ఓ ప్రభంజనం. నటనలో వేగం, స్టైల్లో ప్రత్యేక మేనరిజమ్స్, మార్షల్ ఆర్ట్స్‌లో అద్భుత ప్రావీణ్యం ఆయన ప్రత్యేకత. చాలా కాలం విరామం తర్వాత, 2026 జనవరి 7 న తన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో ఒక “కొత్త దశ” ప్రారంభం కాబోతున్నట్లు తాజా పోస్టర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ విడుదల చేసిన ఈ పోస్టర్లో జపాన్ సంస్కృతిని ప్రతిబింబించే ఎర్రటి సూర్యుడు, కటానా కత్తి కనిపించడం విశేషం. ఇది కేవలం ప్రకటన మాత్రమే కాక, యుద్ధ విద్యల పట్ల ఆయనకు ఉన్న మక్కువ మరింత లోతుగా మారబోతుందనే సంకేతంగా భావిస్తున్నారు.
కెరీర్ ఆరంభం నుంచే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన ఆయన, తమ్ముడు, బద్రి, జానీ వంటి సినిమాల్లో అప్పటివరకు చూడని ఫైట్ కంపోజిషన్లతో యువతను ఆకట్టుకున్నారు. స్వయంగా డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్సులు అప్పట్లో ట్రెండ్ సెట్ చేశాయి. పోస్టర్లో కనిపిస్తున్న తేదీ అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ఇది యువత కోసం శిక్షణా కేంద్రం ఆరంభమా? లేదా మార్షల్ ఆర్ట్స్‌పై స్ఫూర్తిదాయకమైన కొత్త ప్రాజెక్టా? అన్నది ఆసక్తికర చర్చగా మారింది. ఏదైనా సరే, పవన్ కళ్యాణ్ తన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!