
.jpeg&w=3840&q=75)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యంత భారీ విజయంగా నిలిచిన చిత్రం పుష్ప 2: ది రూల్ ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. భారత సినీ పరిశ్రమను కుదిపేసిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ, జపాన్‌లో పుష్ప కున్రిన్ అనే టైటిల్‌తో జనవరి 16 న థియేటర్లలో విడుదల కానుంది.
విడుదలైన తొలి రోజునుంచే సంచలనంగా మారిన పుష్ప 2 భారత బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంలో జపాన్ నేపథ్యంతో కూడిన ప్రత్యేక సన్నివేశం ఉండటం విశేషం. పుష్ప ఎంట్రీ ఫైట్ సీన్ జపాన్ వాతావరణంలో సాగుతుండగా, అందులో అల్లు అర్జున్ స్వయంగా జపనీస్ భాషలో డైలాగులు చెప్పడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ అంశాలే ఇప్పుడు జపాన్ ప్రేక్షకుల్లో సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
జపాన్ విడుదల నేపథ్యంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి టోక్యో కు చేరుకున్నారు. అక్కడి నగర దృశ్యంతో తీసిన ఫొటోను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటూ Tokyo అనే క్యాప్షన్‌ను జత చేశారు.
జపాన్‌లో ఈ చిత్రాన్ని గీక్ పిక్చర్స్, షోచికు సంస్థలు, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే జపాన్ ప్రేక్షకుల్లో భారతీయ సినిమాలకు మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో, పుష్ప కున్రిన్ కూడా అక్కడ ఘన విజయం సాధిస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కథానాయికగా రష్మిక మందన్న నటించగా, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు ఈ సినిమాను నిర్మించారు. జనవరి 15, 2026 న జపాన్‌లో ప్రీమియర్స్ ప్రదర్శనలు జరగనున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!