

ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తున్న రూరల్ ఎంటర్‌టైనర్ ఇడుపు కాయితం సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తెలంగాణ యాసలో ఉన్న టైటిల్ కారణంగా గతంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదురయ్యాయి. తాజాగా సినిమా నుంచి ఓ పాట విడుదల కావడంతో మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా పాటలోని పెళ్లి సన్నివేశాలపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
పెళ్లిలో మద్యం వడ్డించే విధానాన్ని సినిమాలో చూపించిన తీరు తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా లేదని కొందరు విమర్శిస్తున్నారు. సినిమా ప్రమోషన్ల కోసం ప్రాంతీయ సంస్కృతిని తప్పుగా చూపించవద్దని సూచిస్తున్నారు. ఈ విమర్శలపై దర్శకుడు వేణు ఉడుగుల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఒక సమాజపు సంస్కృతిని దాని ప్లేట్లు, గ్లాసుల ఆధారంగా కాకుండా చరిత్ర, శ్రమ, కళలు, పోరాటాల ద్వారా అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణను కించపరచడం సులువని, కానీ ఆ ప్రాంతాన్ని అర్థం చేసుకోవడానికి సంస్కారం, అధ్యయనం అవసరమని అన్నారు. స్థానిక ప్రజల జీవితాలు, సంస్కృతులను నిజాయితీగా తెరపైకి తీసుకొచ్చే సినిమాలను ఆదరించాలని కోరారు. సినిమా విడుదలైన తర్వాత నచ్చకపోతే విమర్శించవచ్చని, అయితే ఒక ప్రాంతపు అస్తిత్వాన్ని అపార్థాలతో నిర్వచించకూడదని అభిప్రాయపడ్డారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!