

ఎలాంటి వివాదాలు వచ్చినా ప్రశాంతంగా, కూల్‌గా హ్యాండిల్ చేయడం రాజమౌళి స్టైల్. ఆర్ఆర్ఆర్ సమయంలో కూడా ఆయన చూపిన ఈ సంయమనం వల్లే ‘కొమరం భీమ్’ ఇష్యూ పెద్ద రాద్ధాంతంగా మారకుండా ఆగిపోయింది. లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ వేషధారణ, అల్లూరి సీతారామరాజుతో చూపించిన స్నేహం విషయంపై చరిత్రకారులు పెద్ద గొడవే చేసేవారు.
ఇప్పుడు ‘వారణాసి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హనుమంతుడి గురించి చేసిన వ్యాఖ్యలు ఇంకా చల్లబడక ముందే మరింత వేడెక్కుతున్నాయి. తాజాగా కొందరు బీజేపీ నాయకులు రాజమౌళి మాటలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలు వ్యక్తం చేయడంతో రాజకీయ రంగు కూడా ఎక్కింది.
ఇంకోవైపు, ‘వారణాసి’ అనే టైటిల్ తమదేనని ఫిలిం ఛాంబర్‌కు లేఖతో పాటు ఆధారాలు చూపిస్తున్న మరో ప్రొడక్షన్ హౌస్‌తో కూడా ఇంకా సెటిల్మెంట్ జరగలేదు. రాజీ ప్రతిపాదన వెళ్లినప్పటికీ, రెండు వర్గాలు చర్చలకు రాలేదని సమాచారం. ఇంకా సమయం ఉండటం వల్ల అందరికీ అనువైన రోజు చూసి మీటింగ్ పెట్టి సమస్యను క్లోజ్ చేయాలని పెద్దలు చూస్తున్నారని తెలుస్తోంది. ఇది పాన్–వరల్డ్ ప్రాజెక్ట్ కావడంతో రాజమౌళి నిర్ణయానికి కీలక పాత్ర ఉండొచ్చు. టైటిల్ రిజిస్టర్ చేసుకున్న హక్కుదారుడికి న్యాయం అనిపించేలా పరిహారం ఇచ్చే అవకాశమూ లేకపోలేదు.
ఇది ఇంకా ప్రారంభమే. షూటింగ్ సగం కూడా పూర్తికాలేదు. రాబోయే రోజుల్లో రాజమౌళి మరెన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఎన్నడూ లేనట్లుగా జక్కన్న మీద నెగటివిటీ కనిపించడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇంకోవైపు టీమ్ ప్రమోషన్లు ఆపకుండా కొనసాగుతోంది. మహేష్ బాబుతో పాటు ప్రధాన నటీనటులతో ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. ఇవి అంతర్జాతీయస్థాయిలో సినిమాను ప్రమోట్ చేయడానికి ఉపయోగించబోతున్నారు. చుట్టూ ఇంత రభస ఉన్నా రాజమౌళి తన పనిలో తానే బిజీగా ఉంటున్నారని, బ్యాక్ఎండ్ సమస్యలను కార్తికేయ చూసుకుంటున్నాడని భావిస్తున్నారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!