

వరుస హిట్లతో దూసుకెళ్తున్న మాసెస్ గాడ్ నందమూరి బాలకృష్ణ, వీరసింహారెడ్డి విజయానంతరం మరోసారి దర్శకుడు గోపిచంద్ మలినేనితో జట్టుకట్టారు. ఇద్దరి కలయికలో రూపొందుతున్న NBK111 చిత్రాన్ని ప్రతిష్టాత్మక వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మాత వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. సింహా, జై సింహా, శ్రీ రామరాజ్యం తర్వాత బాలకృష్ణ-నయనతార కలిసి నటిస్తున్న నాలుగో చిత్రం ఇది.
ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లో సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ నిర్మాతలకు స్క్రిప్ట్ అందించారు. బాలకృష్ణతో ఎన్నో బ్లాక్బస్టర్లు అందించిన దర్శకుడు బి. గోపాల్ క్లాప్ ఇచ్చారు. బాలయ్య కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్‌కు బోయపాటి శ్రీను, బాబీ, బుచ్చి బాబు సంయుక్తంగా దర్శకత్వం వహించారు.
తొలిసారి హిస్టారికల్ డ్రామా శైలిలోకి అడుగుపెడుతున్న గోపిచంద్ మలినేని, బాలకృష్ణను పూర్తిగా కొత్త రూపంలో చూపించబోతున్నారని చిత్రబృందం తెలిపింది. విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ లో బాలకృష్ణ ఒక చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో యాంకర్ పట్టుకొని అద్భుతమైన రాజసంతో కనిపించారు. పొడవాటి జుట్టు, గడ్డం, యుద్ధ వీరుడిలా బాలయ్య లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇక మిగతా నటీనటులు, సాంకేతిక బృంద వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.










కామెంట్స్ (2)
బాలయ్య కొత్త లుక్ అద్భుతం!
Ballayya ruling again! 🙌