

ఇండియాలో ఓటీటీ ప్లాట్ఫార్మ్లు ఆశ్చర్యకరంగా పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో ఓటీటీ కంటెంట్‌ను వీక్షించే వారి సంఖ్య ఊహించని స్థాయికి చేరింది. ఒకప్పుడు వెబ్ సిరీస్ అంటే బూతులు, అశ్లీల సీన్స్ ఎక్కువ ఉంటాయనే అభిప్రాయం బలంగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా ఓటీటీలు ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని శుభ్రమైన, అందరికీ సరిపోయే కంటెంట్‌ను విడుదల చేస్తున్నాయి.
అయినా కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇంకా ఎక్కువ శృంగార సన్నివేశాలతో వస్తుండటం వల్ల కుటుంబంతో కలిసి చూడాలంటే ఇబ్బందులు తప్పట్లేదు. సినిమా మంచి కథతో వచ్చినా, మధ్య మధ్యలో వచ్చే అశ్లీల దృశ్యాలే కుటుంబ ప్రేక్షకులను అసౌకర్యానికి గురి చేస్తున్నాయి. ఇది దాదాపు అన్ని ఓటీటీలపై వినిపిస్తున్న కామన్ ఫిర్యాదే.
ఇటీవల ఒక ప్రముఖ ఓటీటీలో వరుసగా కండోమ్ యాడ్స్ రావడంతో అక్కడి యూజర్లు తీవ్రంగా ఆక్షేపించారు. కంపెనీ కూడా వెంటనే చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. ఇప్పుడు నెటిజన్స్ మరో కొత్త డిమాండ్ చేస్తున్నారు
సినిమాలో ‘A’ సీన్ వచ్చే ముందు స్కిప్ బటన్ వస్తే బాగుంటుందంటున్నారు. ఇప్పటికే ఓటీటీల్లో టైటిల్ కార్డులను స్కిప్ చేయడం, పాటలను స్కిప్ చేయడం వంటి ఆప్షన్లు ఉన్నాయి. అయితే వాటితో సరిపోదని, కుటుంబ సభ్యులతో చూస్తున్నప్పుడు సడెన్‌గా వచ్చే శృంగార సన్నివేశాలను కూడా స్కిప్ చేసే అవకాశం ఉండాలని చాలా మంది అంటున్నారు.
వీకెండ్స్‌లో కుటుంబంతో కలిసి ఓటీటీ చూడడం చాలా మందికి అలవాటు అయ్యింది. అలాంటి సమయంలో అనుకోకుండా వచ్చే అశ్లీల దృశ్యాలు అసౌకర్యానికి గురి చేస్తున్నాయి. రిమోట్ పట్టుకుని ముందుగానే స్కిప్ చేసే బటన్ ఉంటే సమస్యే ఉండదు అనేది ఎక్కువ మంది ఆడియన్స్ అభిప్రాయం.
ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఫ్యామిలీ ఆడియన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చే ప్లాట్ఫార్మ్స్ ఈ ఫీచర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని నెటిజన్స్ వాదిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో స్కిప్ A సీన్ ఫీచర్ కోసం ప్రచారం కూడా మొదలైంది.
ఫ్యామిలీ ఆడియన్స్‌ను మరింత ఆకర్షించాలంటే, ఓటీటీలు స్వీయ నియంత్రణ పాటిస్తూ అధిక హింస, అధిక శృంగార సన్నివేశాలకు స్కిప్ ఆప్షన్ ఇవ్వాలని నెటిజన్స్ తేల్చి చెబుతున్నారు. భవిష్యత్తులో ఓటీటీలు ఈ మార్పు తీసుకువస్తాయా అన్నది కాలమే చెప్పాలి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!