

దీక్షిత్ శెట్టి, కృతికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ బ్యానర్ పై హర్షిత చదలవాడ, దుర్గా చుంచు, రమాదేవి కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఇటీవల ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ అనే ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ, ‘శబార’ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తన ‘గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు మీడియా మంచి మద్దతు ఇచ్చిందని, అదే విధంగా ‘శబార’కు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘శబార’ అనేది ఒక ప్రపంచం అని, ప్రేమ్ చంద్ సృష్టించిన ఆ ప్రపంచం మొత్తం అడవిలోనే సాగుతుందని వివరించారు. ఈ సినిమాకు ఖచ్చితంగా సక్సెస్ మీట్ జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల పాటు తమతో కలిసి ప్రయాణించిన టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
దర్శకుడు ప్రేమ్ చంద్ కిలారు మాట్లాడుతూ, ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’కు మంచి స్పందన రావడం ఆనందంగా ఉందన్నారు. షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తామని చెప్పారు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన దీక్షిత్ శెట్టికి కృతజ్ఞతలు తెలిపారు. సినిమానే తమ పనికి సమాధానం చెబుతుందని ఆయన పేర్కొన్నారు.
నటి కృతికా సింగ్ మాట్లాడుతూ, ప్రేమ్ చంద్ గారు తన పై నమ్మకం పెట్టుకుని మంచి పాత్ర ఇచ్చినందుకు థాంక్స్ చెప్పారు. ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’కు వస్తున్న స్పందన తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు.
మిషా నారంగ్ మాట్లాడుతూ, ‘శబార’ కన్నులపండుగలా ఉంటుందని, అద్భుతమైన లొకేషన్లలో ఎంతో కష్టపడి చిత్రీకరించామని తెలిపారు. ఈ సినిమాకు ప్రేక్షకులు తప్పకుండా మద్దతు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజీవ్ గోవింద పిళ్లై, భూషణ్ కళ్యాణ్, మోహన్ భగత్ తదితరులు మాట్లాడుతూ, ‘శబార’ ఒక ప్రత్యేకమైన కథతో రూపొందిన సినిమా అని, థియేటర్లో చూడాల్సిన అనుభూతిని అందిస్తుందని చెప్పారు.
సంగీత దర్శకుడు మిథున్ ముకుందన్ మాట్లాడుతూ, ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’కు మంచి స్పందన ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. కథ విన్నప్పుడే ఈ సినిమా విజయవంతమవుతుందనే నమ్మకం కలిగిందన్నారు. త్వరలో మరిన్ని ప్రమోషనల్ అప్డేట్స్తో ప్రేక్షకుల ముందుకు వస్తామని చెప్పారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!