

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్కు ముంబయి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. ముంబయిలోని జుహు ప్రాంతంలో ఉన్న ఆయన బంగ్లాలో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాల్లో కొంత భాగాన్ని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు కూల్చివేశారు. కపోల్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఉన్న ఈ బంగ్లా 7,802 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. భవనంలో పార్టిషన్ గోడల నిర్మాణం, కిటికీల మార్పులు, ఇతర నిర్మాణ పనులు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఈ పనులకు అవసరమైన అనుమతులు తీసుకోలేదని బీఎంసీ పేర్కొంది. దీంతో అనధికార నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు.
నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని, సంబంధిత అనుమతి పత్రాలను సమర్పించాలని కోరుతూ బీఎంసీ గతంలోనే నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 10న ఈ నోటీసులు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ పనులు కొనసాగినట్లు గుర్తించడంతో తాజాగా కూల్చివేత చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అయితే, కూల్చివేసిన నిర్మాణాల పూర్తి వివరాలు, ఈ వ్యవహారంపై అజయ్ దేవగణ్ లేదా ఆయన ప్రతినిధుల స్పందనకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!