

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియా జంటగా దర్శకుడు రవి నంబూరి రూపొందించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంటోంది. ప్రీమియర్ ప్రదర్శనల నుంచే సానుకూల స్పందన దక్కించుకున్న ఈ చిత్రం, తొలి రోజు వసూళ్లతో మంచి ఆరంభాన్ని నమోదు చేసింది. అదే ఉత్సాహం రెండో రోజూ కొనసాగడంతో థియేటర్లకు ప్రేక్షకుల రాక మరింత పెరిగింది. కుటుంబ ప్రేక్షకులతో పాటు యువత కూడా సినిమాపై ఆసక్తి చూపుతుండటంతో ప్రదర్శనలకు మంచి స్పందన లభిస్తోంది. కథ, భావోద్వేగాలు, సంగీతం కలిసి సినిమాకు ప్రధాన బలంగా మారినట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఆదరణ ప్రభావం టికెట్ విక్రయాలపై కూడా స్పష్టంగా కనిపించింది. ‘బుక్ మై షో’లో 1,56,000కు పైగా టికెట్లు అమ్ముడవగా, తొలి రోజుతో పోలిస్తే విక్రయాలు 35% పెరిగినట్లు సమాచారం. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సుమారు 300 అదనపు ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. మణిశర్మ అందించిన సంగీతం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చగా, మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు ప్రశంసలు అందుకుంటున్నాయి. త్రిగుణ్ పోషించిన పాత్రకు కూడా మంచి స్పందన వస్తుండగా, ఇదే జోరు కొనసాగితే రానున్న రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!