

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23న తన 47వ పుట్టినరోజు జరుపుకున్నారు. అర్ధరాత్రి సమయం రాకముందే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంబరాలు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ప్రభాస్ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. చేతుల్లో పోస్టర్లు, జెండాలు పట్టుకుని తమ అభిమాన నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అర్ధరాత్రి సమయానికి అభిమానుల కేరింతలు, నినాదాలతో ఆ ప్రాంతం సందడిగా మారింది. ప్రభాస్ చిత్రాలతో కూడిన జెండాలను ఊపుతూ, పుట్టినరోజు పోస్టర్లను ప్రదర్శిస్తూ అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. భీమవరంలోనూ అభిమానులు ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించగా, దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రభాస్ పుట్టినరోజు సంబరాలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి.
ప్రభాస్‌కు జపాన్‌లోనూ ప్రత్యేకమైన అభిమాన గణం ఉంది. అక్కడి అభిమానులు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక వీడియోను రూపొందించి తమ ప్రేమను చాటుకున్నారు. నలుపు, బంగారు రంగు దుస్తులు ధరించి, కేక్, బెలూన్లు, ప్రభాస్‌కు సంబంధించిన జ్ఞాపికలు, అలంకరణలతో వేడుక నిర్వహించారు. “హ్యాపీ బర్త్‌డే ప్రభాస్ గారు.. హ్యాపీ బర్త్‌డే ప్రభాస్-సాన్” అంటూ పాటలు పాడి శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది ప్రభాస్ జపాన్ పర్యటన తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని గుర్తుచేసుకుంటూ, ఆయన మరోసారి జపాన్‌కు రావాలని ఆకాంక్షించారు. ఆయన కొత్త సినిమాలు విడుదలైనప్పుడు భారత్‌కు వచ్చి చూడాలనే కోరికను కూడా వ్యక్తం చేశారు. ఈ వేడుకలు ప్రభాస్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అభిమానాన్ని మరోసారి చాటిచెప్పాయి.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియడ్ యాక్షన్ చిత్రం ఫౌజీ, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ ఆయన తదుపరి చిత్రాల్లో ఉన్నాయి. స్పిరిట్ 2027లో విడుదల కానుండగా, ఫౌజీ విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సీక్వెల్ కూడా ఆయన ప్రాజెక్టుల జాబితాలో ఉంది. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖ నటులు కూడా ఉన్నారు. కొత్త సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ, ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు దేశ విదేశాల్లో ఘనంగా జరిగాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!